రాముని చెరువు కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
వాకర్స్ అసోసియేషన్ వినతిపై ఎమ్మెల్యే సానుకూల స్పందన
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు పార్క్‌ను ఆక్రమణల నుంచి పరిరక్షించి, కబ్జాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును కోరారు.
సోమవారం ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేసిన వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు రంగు రాజేశం మాట్లాడుతూ, పట్టణ ప్రజలు ఉదయం, సాయంత్రం ఆరోగ్య పరిరక్షణ కోసం కాలినడకన విహరించే ఏకైక ప్రదేశం రాముని చెరువు పార్క్ మాత్రమేనని తెలిపారు.
పట్టణం విస్తరిస్తున్న కొద్దీ పార్కు స్థలం తగ్గుతూ ఆక్రమణలకు గురవుతోందని, దీనిపై మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొంటూ, ఆక్రమణలపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
