అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
- రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ..
- పొట్టిపాడులో సీసీ రోడ్ల ప్రారంభం
- ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో మంత్రి బీసీ
నంద్యాల, ఆంధ్రప్రభ: ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. సోమవారం బనగానపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కోవెలకుంట్ల మండలం పొట్టిపాడు గ్రామంలో రైతులకు “రాజముద్ర”తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
అనంతరం పొట్టిపాడు గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీల్లో సుమారు రూ.35 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పట్టాదారు పాస్ పుస్తకాలను తప్పులు తడకగా మార్చడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా రైతుల భూ హక్కులను పరిరక్షిస్తున్నామని తెలిపారు.
రైతులకు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చీకటి చట్టాన్ని రద్దు చేసి రైతన్నల హక్కులను కాపాడిందన్నారు. భూమినే ప్రాణంగా భావించే రైతులకు ఎలాంటి భూసమస్యలు లేకుండా చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం “ఇంటింటికి తెలుగుదేశం పార్టీ” కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను వివరించే కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను ప్రజలకు వివరించి, వాటిని ప్రతి కుటుంబానికి చేరవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
