రాష్ట్రవ్యాప్తంగా దళితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

దళితులకు ఇందిరమ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్

మహబూబ్‌నగర్ రూరల్, ఆంధ్రప్రభ : దళితులు రాష్ట్రవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్ పిలుపు మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సురేష్ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో దళితులకు తొలి ప్రాధాన్యం కల్పించాలని కోరారు. అసైన్డ్ భూములను పూర్తిస్థాయి హక్కులతో దళితులకు అందించాలని, పేదలకు ఇంటి స్థలాల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ పథకాన్ని పునరుద్ధరించాలని, గ్రామాల్లో బెల్ట్ షాపులను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పారిశ్రామిక రుణాల సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని, పోడు సాగు చేస్తున్న దళిత రైతులకు భూమి పట్టాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కోశాధికారి పత్తి ఆంజనేయులు, కౌన్సిల్ సభ్యుడు డి. వెంకట్రాములు పాల్గొన్నారు.