గ్యాస్ సిలిండర్ పేలుడు..
తండ్రి, ముగ్గురు పిల్లలకు తీవ్ర గాయాలు
108 సిబ్బంది సమయస్ఫూర్తితో నలుగురి ప్రాణాలు కాపాడిన ఘటన
మేడ్చల్, ఆంధ్రప్రభ: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల వివరాల ప్రకారం.. శ్రీరంగవరం పట్టణానికి చెందిన చింతల శ్రీనివాస్ (37) తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు ఇంటి అంతటా వ్యాపించడంతో శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమార్తెలు ప్రవళిక (14), హరిప్రియ (10), కుమారుడు విక్రాంత్ (6) తీవ్రంగా గాయపడ్డారు.
పేలుడు శబ్దం విని స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మేడ్చల్ 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ బాలకృష్ణ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని బాధితుల పరిస్థితిని ఈఆర్సీపీ డాక్టర్ చక్రవర్తికి ఫోన్ ద్వారా వివరించారు. డాక్టర్ సూచనల మేరకు ఈఎంటీ సీతారాం సంఘటనా స్థలంలోనే ప్రాథమిక చికిత్స అందించారు.
అనంతరం నలుగురినీ మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
అర్ధరాత్రి వేళ వేగంగా స్పందించి బాధితులకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది సీతారాం, బాలకృష్ణల సమయస్ఫూర్తిని స్థానికులు, బాధితుల కుటుంబ సభ్యులు అభినందించారు.
