Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై ఆషాఢ సందడి..

అమ్మవారి ఆలయంలో రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ
ఒక్కరోజే 68,571 మందికి అమ్మవారి దర్శనం
ఆలయ పవిత్రతకు భంగం.. ఇన్‌స్టాగ్రామ్ రీల్‌పై పోలీసులకు ఫిర్యాదు
భక్తుల సౌకర్యాలపై ఈఓ శీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు
మీడియా ప్రతినిధుల ఆషాఢ సారె..
అమ్మవారికి రూ.3 లక్షల విలువైన బంగారు నత్తుబొట్టు విరాళం


Indrakeeladri | ( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) :
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. శనివారం ఒక్కరోజే 68,571 మంది భక్తులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోగా, ఆలయ పవిత్రతకు భంగం కలిగించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఘటనపై దేవస్థానం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు భక్తులకు మెరుగైన సేవల కల్పనపై ఈఓ వి.కె. శీనా నాయక్ విస్తృత తనిఖీలు నిర్వహించగా, మీడియా ప్రతినిధులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించారు. ఓ భక్త దంపతులు రూ.3 లక్షల విలువైన బంగారు నత్తుబొట్టును విరాళంగా అందజేశారు.

ఆషాడ ఉత్సవాల సందడి..

ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేవస్థానం గణాంకాల ప్రకారం శనివారం ఒక్కరోజే 68,571 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 8,145 దర్శన టికెట్లు జారీ చేయగా, 309 మంది ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. 1,14,712 ప్రసాదాలు విక్రయించగా, రూ.2,93,657 విరాళాలు అందాయి. 2,801 మంది తలనీలాలు సమర్పించగా, 14,210 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

ఇంస్టాగ్రామ్ రీల్ పోలీస్ లకు ఫిర్యాదు…

ఇదే సమయంలో ఆలయంలో డ్యాన్స్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ రీల్ చిత్రీకరించిన ఘటనపై దేవస్థానం తీవ్రంగా స్పందించింది. ఆలయ పవిత్రత, సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొంటూ సంబంధిత యువతిపై విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేసింది. జూలై 30న మహామండపంలోని రాజగోపురం వద్ద రీల్ చిత్రీకరించినట్లు గుర్తించి, సంబంధిత యువతిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది.

రద్దికి ప్రత్యేక ఏర్పాట్లు..

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈఓ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ ఘాట్ రోడ్డు, కేశఖండనశాల, కృష్ణా స్నానఘట్టాలు, టికెట్ కౌంటర్లు, మొబైల్ డిపాజిట్ కేంద్రాలు, చెప్పుల స్టాండ్లు, లగేజీ కౌంటర్లు, భద్రతా స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్యం, భద్రత, క్యూ లైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మీడియా ప్రతినిధుల ఆషాడసారె …

ఆషాఢ సారె ఉత్సవాల సందర్భంగా మీడియా ప్రతినిధులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి చేరుకుని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈవో వి.కె. శీనా నాయక్ మీడియా బృందానికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

అమ్మవారికి బంగారు ఆభరణాలు…

అలాగే విజయనగరం జిల్లా గాజులరేగకు చెందిన కే. సత్యనారాయణ–అప్పాయమ్మ దంపతులు అమ్మవారికి 19.500 గ్రాముల బరువున్న బంగారు నత్తుబొట్టును విరాళంగా సమర్పించారు. సుమారు రూ.3 లక్షల విలువైన ఈ ఆభరణాన్ని ఆలయ అధికారులకు అందజేయగా, ప్రత్యేక పూజల అనంతరం వారికి వేద ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు.