రైతులకు భరోసా…

ప్రజలకు కూటమి ప్రభుత్వం ఊరట
రూ.10-12 తక్కువకు సన్నబియ్యం
వినియోగదారులకు ఊరట.. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్


కంకిపాడు – ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ధాన్యం ధరలు పెరగడంతో ప్రజలపై భారం పడకుండా కూటమి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది, అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో నాణ్యమైన సన్నబియ్యాన్ని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో మార్కెట్ ధర కంటే సుమారు రూ.10 నుంచి రూ.12 వరకు తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు.

కంకిపాడులోని రైతు బజార్ లో పౌరసరఫరాల శాఖ, కృష్ణ జిల్లా మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సన్న బియ్యం కొనుగోలు షాపుని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశం అన్నారు.

రైతుల విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు,మామిడి, మిర్చి,ధాన్యం వంటి పంటలకు సంబంధించి రైతుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి,అవసరమైన చోట ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర…మరోవైపు వినియోగదారులకు అందుబాటు ధర…ఈ రెండు లక్ష్యాలను సమన్వయం చేస్తూ పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే, రైతు సంక్షేమం,ప్రజల ప్రయోజనమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.