70 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఒక లారీ స్వాధీనం

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏఎస్పీ సూచన

బాసర, ఆంధ్రప్రభ : ప్రజల భద్రత కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. సోమవారం బాసరలోని ఆర్టీసీ బస్టాండ్ సమీప ప్రాంతంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు ఇంటింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, ఆరు ఆటోలు, ఒక లారీతో పాటు నంబర్ ప్లేట్ లేని నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఏఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.

యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ముధోల్, బాసర సీఐలు రవీందర్ నాయక్, దీపక్, ఎస్సైలు బిట్ల పెర్సీస్, ప్రదీప్, జుబేర్, సర్పంచ్ వెంకటేష్ గౌడ్, పోలీసు సిబ్బంది, హోం గార్డులు పాల్గొన్నారు.