ఆదివాసీల రాస్తారోకో..
- అటవీ శాఖ కార్యాలయంపై దాడి..
- ఫర్నిచర్ ధ్వంసం
జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందనపల్లి అటవీ శాఖ రేంజ్ కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్న ఆదివాసీ యువకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు ఆగ్రహంతో అటవీ శాఖ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసి, కార్యాలయ రికార్డులను చిందరవందర చేశారు.
స్థానికుల కథనం ప్రకారం.. నాయకపుగూడ గ్రామానికి చెందిన ఆరుగురు ఆదివాసీ యువకులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం అందడంతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, పలువురు ఆదివాసీ నాయకులు ఇందనపల్లి రేంజ్ కార్యాలయానికి చేరుకున్నారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి, నినాదాలు చేస్తూ బైఠాయించారు.
సమాచారం అందుకున్న లక్షేటిపేట సీఐ రమణమూర్తి, జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్, దండేపల్లి ఎస్సై రాజవర్ధన్ తదితర పోలీసులు భారీ బందోబస్తుతో అక్కడికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే వారు రాస్తారోకోను విరమించకుండా నిరసన కొనసాగించారు.
ఈ ఘటనపై ఇందనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి జి. లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు వచ్చిన ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. అనంతరం వారిలో ఒకరు తప్పించుకుని పరారవగా, ఐదుగురు తమ అదుపులో ఉన్నారని చెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
