హైదరాబాద్, ఆంధ్రప్రభః ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయని.. అభివృద్ధి పనుల్లో మాత్రం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బోరబండలోనిర్మించిన మంచినీటి రిజర్వాయర్ ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కలసి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా ఈ రిజర్వాయర్‌ను పూర్తి చేయాలని రెహమత్‌నగర్ ప్రజలు ఆందోళన చేశారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.
ఎన్నో ఆందోళనల తర్వాత ఈ రిజర్వాయర్ పూర్తి అవ్వడం సంతోషకరమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు స్థానం ఉందని తెలిపారు. గతం కంటే హైదరాబాద్ జనాభా 33 శాతానికి పెరిగిందని అన్నారు.. నగరానికి ఎంతోమంది జీవనోపాధి కోసం వస్తుంటారని చెప్పారు. హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గత పదేళ్లుగా హైదరాబాద్‌కు ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి, కృష్ణా జలశయాల నుంచి రాలేదని అన్నారు. భాగ్యనగరంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని సిటీకి నీళ్లు ఎక్కువ కేటాయించాలని అధికారులను కోరారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన ప్లానింగ్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం అన్నిరకాలుగా కృషిచేస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.