Pawan Kalyan |నల్లమల పులుల భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు

పులుల సంరక్షణ, ఆవాసాల పరిరక్షణ, వన్యప్రాణుల భద్రతపై సమగ్ర అధ్యయనానికి శ్రీకారం

అమరావతి, ఆంధ్రప్రభ: నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్‌)లో పులుల సంరక్షణ, వాటి ఆవాసాల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులుల సంరక్షణ వ్యవస్థను అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసులు అందించేందుకు ఐదుగురు సభ్యులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇటీవల నల్లమల అటవీ ప్రాంతంలో ఆడ పులి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో పులుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ, అటవీ నిర్వహణలో అమలవుతున్న విధానాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం అవసరమని నిర్ణయించింది.

కమిటీలో రాష్ట్ర అటవీశాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి (ఏపీసీసీఎఫ్‌) రాహుల్ పాండే శాఖాపరమైన సభ్యులుగా ఉంటారు. అలాగే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) ప్రతినిధి బి. రాజశేఖర్, హైదరాబాద్ కన్జర్వేషన్ ఫర్ టైగర్ సొసైటీ సభ్యుడు ఇమ్రాన్ సిద్ధిఖీ, ప్రముఖ వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం. నవీన్ కుమార్ కమిటీలో సభ్యులుగా సేవలందించనున్నారు. కమిటీ పనితీరుకు అవసరమైన సమన్వయ బాధ్యతలను సంబంధిత సీసీఎఫ్ అధికారి నిర్వహించనున్నారు.

పులుల జనాభా, వాటి ఆవాసాలకు ఎదురవుతున్న ముప్పులు, సంరక్షణలో ఉన్న లోపాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవల జరిగిన ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా సంస్థాగత మార్పులు, సిబ్బంది సామర్థ్యాల పెంపు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై స్పష్టమైన సిఫారసులు చేయాలని సూచించింది.

క్షేత్రస్థాయిలో అటవీ శాఖ అధికారులు, నిపుణులు, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమావేశాలు నిర్వహించి శాస్త్రీయ ఆధారాలతో కూడిన నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని కమిటీకి దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలో పులుల సంరక్షణ, అడవుల పరిరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, హైపవర్ కమిటీ సిఫారసులు నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.