ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
రేపల్లె, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆదివారం రేపల్లె టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి, అందిన ప్రతి వినతిపత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ప్రతి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రజలకు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రజా దర్బార్ కార్యక్రమమే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని స్థాయిల్లో చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.
