రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక
- నేరాలకు దూరంగా ఉండండి..
- లేదంటే కఠిన చర్యలు తప్పవు!
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ: జిల్లాలో నేర చరిత్ర కలిగిన రౌడీషీటర్లకు శ్రీకాకుళం జిల్లా పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవనం సాగించాలని సూచించారు.
జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీఐ పైడిపు నాయుడు, ఎస్సై హరికృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇదే తరహాలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీషీటర్లకు కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పోలీసుల సూచనలు, ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా నేరాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నేరాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, అనవసర ఘర్షణలు, గొడవలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
అలాగే చెడు వ్యసనాలను విడిచిపెట్టి, మంచి నడవడికతో సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొనరాదని హితవు పలికారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం కొనసాగుతుందని, ఎక్కడైనా నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
