చెరువులో పడి 4వ తరగతి విద్యార్థి మృతి
- విద్యార్థిని కబళించిన చెరువు నీటి గుంటలు
- అక్రమం మట్టి తవ్వకాల వల్ల ఏర్పడిన గుంటలే బాలుని మృతికి కారణం..?
కంచికచర్ల, ఆంధ్రప్రభ: అక్రమ మట్టి తవ్వకాలు… ఓ అమాయక కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. అధికారుల ఉదాసీనత… అక్రమ మట్టి తవ్వకం దారుల ధనార్జన… అన్నెం పుణ్యం ఎరుగని మట్టి పనులు చేసుకునే ఓ అమాయక నిరుపేద కుటుంనానికి కడుపు కోత మిగిల్చింది. వెరసి నాలుగో తరగతి చదువుతున్న ఎనిమిది ఏళ్ల నరసింహానికి నిండు నూరేళ్లు నిండాయి. కంచికచర్ల చెరువులో ఇటీవల త్రవ్విన అక్రమ మట్టి తవ్వకాల గుంటల్లో పడి ఆ చిన్నారి విద్యార్థి మృతి చెందడం నిరుపేదల కుటుంబాలలో విషాదాన్ని నింపింది.
కంచికచర్ల పట్టణం చెరువు కట్ట బజార్ లో నివాసముంటు ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న వేముల నరసింహ (8) శనివారం సాయంత్రం నుంచి కనిపించ లేదు. ఎంత వెతికినా తమ కుమారుడు కనిపించలేదని కంచికచర్ల పోలీసు స్టేషన్ లో బాలుడి తల్లి పూర్ణిమ శనివారం రాత్రి ఫిర్యాదు చేసింది. కాగా నరసింహ తన స్నేహితుడు శ్రీహరితో కలిసి వారి ఇంటికి సమీపంలోని చెరువు వద్ద శనివారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లారు.
ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నరసింహ కాలుజారి నీటిలో పడి మునిగిపోయాడు. పక్కనే ఉన్న శ్రీహరి తన మిత్రుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో భయపడి వెనుతిరిగి ఇంటికి వచ్చి విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నరసింహ ఆదివారం ఉదయానికి పక్కనే ఉన్న చెరువులో విగత జీవునిగా తేలియాడుతూ కనిపించాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు మృతదేహాన్ని చెరువు నుండి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నందిగామ మార్చురీకీ తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం..
చెరువులో పడి మృతి చెందిన నరసింహ తల్లిదండ్రులు నిరుపేదలు. తండ్రి లక్ష్మయ్యకు అంగవైకల్యం ఉన్నప్పటికీ.. తల్లి పూర్ణిమతో మట్టి పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. లక్ష్మయ్యకు కూతురుతో పాటు నరసింహ ఇరువురు సంతానం. ఇరువురు మట్టి పనులు చేస్తూనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబం వారిది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇంట్లో చిన్నవాడైన నరసింహ శనివారం సాయంత్రం స్కూలుకు వెళ్లి వచ్చి ఆటలాడుకుంటూ కనిపించకుండా పోయి, ఆదివారం ఉదయానికి విగత జీవుడుగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదన అందర్నీ కలచివేసింది. విగతజీవిగా మారిన నరసింహాన్ని చూసి చెరువుకట్ట బజార్లో కంటతడి పెట్టని వారు లేరు.
అక్రమ మట్టి తవ్వకాలే కారణమా..?
ఇటీవల కంచికచర్ల చెరువులో అడ్డగోలుగా మట్టి తవ్వకాలు జరగడం వల్ల పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. వర్షానికి నిండుగా నీటితో నిండిన ఆ గోతుల్లో ఆడుకునేందుకు వెళ్లిన నరసింహ అందులో పడి మృతి చెందినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. ప్రతి ఏటా చెరువులో అక్రమంగా మట్టి తవ్వడం వల్ల పెద్దపెద్ద గోతులు ఏర్పడి ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇది అనవాయితీగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే నెల రోజులకు పైగా అక్రమంగా మట్టి తవ్వి లక్షలు దండుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చెరువులో అక్రమ తవ్వకాలు, ప్రమాదకరమైన గోతులపై స్థానిక రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులకు తెలిసినా స్పందించలేదని, ప్రజలు మండిపడుతున్నారు.
సాయం అందించిన తెదేపానేతలు కోగంటి..రామకృష్ణ
ప్రమాదవశాత్తు కంచికచర్ల చెరువు గుంటల్లో పడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోగంటి బాబు, పార్టీ నాయకుడు రామకృష్ణలు భారీగా ఆర్ధిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీ సైతం మృతుని కుటుంబానికి అండగా ఉంటుందని, ప్రభుత్వం పరంగా అన్ని రకాలుగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు పరామర్శ
ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన నాలుగో తరగతి విద్యార్థి నరసింహ మృతదేహాన్ని నందిగామ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు సందర్శించి, సంతాపం ప్రకటించి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి వైసిపి పార్టీ అండగా నిలుస్తుందని, న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు.
వైసీపీ కంచికచర్ల పట్టణ అధ్యక్షులు వేమా సురేష్ బాబు వేకువ జామునే అనుచరులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని, బాలుడి తల్లిదండ్రులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. మట్టి ఖర్చులు కింద తక్షణంగా వేమా సురేష్ బాబు 20వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

