స్నేహితుల దినోత్సవాన అపూర్వ స్నేహబంధం

బాధిత మిత్రుడికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించిన సహచరులు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: స్నేహం అంటే కేవలం సరదాలు, సంతోషాలే కాకుండా కష్టసమయంలో అండగా నిలబడటమేనని చౌటుప్పల్‌కు చెందిన ఓ మిత్రబృందం నిరూపించింది.

స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌటుప్పల్ పట్టణానికి చెందిన చిందం రవికి, ఆయనతో కలిసి 10వ తరగతి చదివిన సహచర విద్యార్థులు రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించి తమ అపూర్వ స్నేహబంధాన్ని చాటుకున్నారు.

మందోళ్లగూడెం గ్రామ ఉపసర్పంచ్ డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లోని మల్లికార్జున హైస్కూల్ పూర్వ విద్యార్థులు ఆదివారం చిందం రవి నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనారోగ్య కారణాలతో రవి ఒక కాలును కోల్పోయిన విషయం తెలుసుకున్న స్నేహితులు ఆయనకు ధైర్యం చెప్పి, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టసుఖాల్లో భాగస్వామ్యం కావడమే నిజమైన స్నేహమని, స్నేహితుల దినోత్సవం సందర్భంగా తమ మిత్రుడికి చేయూత అందించడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సుర్కంటి శ్రీధర్ రెడ్డితో పాటు అన్నమోని రాజేష్, ఉష్కాగుల మురళి, వినోద్ కుమార్, సయ్యద్ ఇర్ఫాన్, జో రీగల్ ఆంజనేయులు, సుర్కంటి సురేష్ రెడ్డి, నరేష్, స్వామినాథన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ఫోటో రైటప్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా చిందం రవికి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేస్తున్న సహచర మిత్రులు.