మీ కలలకు ప్రభుత్వం అండ – మంత్రి దుర్గేష్
‘సమాఖ్య-2026’ గ్లోబల్ బిజినెస్ మీట్ పోస్టర్ ఆవిష్కరణ..
స్టార్టప్‌లు, పర్యాటక రంగానికి ప్రభుత్వం పూర్తి ప్రోత్సాహమని మంత్రి వెల్లడి
రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, నలుగురికి ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గ్లోబల్ బిజినెస్ మీట్ – సమాఖ్య 2026’ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్టోబర్ 13 నుంచి 15 వరకు హైదరాబాద్‌లో జరగనున్న గ్లోబల్ బిజినెస్ మీట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేటి యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలో అడుగుపెట్టి మరెందరికో ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు.
పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. పర్యాటక విధానం 2024–29 ద్వారా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి పారదర్శక విధానాలు, అవసరమైన అనుమతులు, పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో యువత, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.
ప్రతి గొప్ప విజయానికి ఒక మంచి ఆలోచనే పునాది అని పేర్కొన్న మంత్రి, ఆలోచనను ఆచరణలోకి తీసుకొస్తే విజయం తప్పకుండా సొంతమవుతుందని అన్నారు. యువత కలలను సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

