హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజాము నుంచి అటవీ ప్రాతంలో ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా కూబింగ్ ఆపరేషన్ చేపడుతోన్న డీఆర్జీ జవాన్లకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతుంది.
మావోయిస్టులకు తేరుకోలేని దెబ్బ
మావోయిస్టులకు తేరుకోలేని దెబ్బ తగులుతుంది. బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవరావు మృతి చెందారు. గతంలో కూడా మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయారు. ఆపరేషన్ కగార్‌తో వరుస ఎన్‌కౌంటర్‌లో దళ సభ్యులతోపాటు అగ్రనేతలను మావోయిస్టు పార్టీ కోల్పోతుంది. కర్రెగుట్ట ఆపరేషన్ తర్వాత నాలుగు ఎన్‌కౌంటర్లలో 53 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోగా, ప్రస్తుత ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నేలకొరిగారు. దీంతో మావోయిస్టు పార్టీ తేరుకోలేని దెబ్బతింటుంది.