APL | రెండో రోజు రసవత్తర పోరు

APL | రెండో రోజు రసవత్తర పోరు

  • అమరావతి రాయల్స్ సునాయాస విజయం..
  • భీమవరం బుల్స్ ఉత్కంఠభరిత ఛేజ్..
  • తుంగభద్రపై 6 వికెట్లతో అమరావతి జయభేరి..
  • 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సంచలనం సృష్టించిన భీమవరం..
  • టోషిత్ యాదవ్, ధీరజ్ కుమార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు..
  • రెండో రోజు ఏపీఎల్‌లో పరుగుల వరద.. అభిమానులకు ఫుల్ మజా!

విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఎంతో ఉత్సాహంగా సాగుతున్న జీఎంఆర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5లో రెండో రోజు జరిగిన రెండు మ్యాచులు అభిమానులకు పూర్తి వినోదాన్ని అందించాయి. తొలి మ్యాచ్‌లో క్యాపిటల్ అమరావతి రాయల్స్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేయగా, రెండో మ్యాచ్‌లో భీమవరం బుల్స్ భారీ లక్ష్యాన్ని ఛేదించి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

తుంగభద్రను చిత్తు చేసిన అమరావతి..

ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండో రోజు తొలి మ్యాచ్‌లో తుంగభద్ర వారియర్స్‌పై క్యాపిటల్ అమరావతి రాయల్స్ పూర్తి ఆధిపత్యం చాటింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అమరావతి బౌలర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. పవర్‌ప్లేలోనే ఒత్తిడి పెంచిన రాయల్స్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ తుంగభద్రను కేవలం 15.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ చేశారు.

టోషిత్ యాదవ్ మూడు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్నెముకను విరిచేయగా, యశ్వంత్, వెంకట శశికాంత్, బండారు అయ్యప్ప రెండేసి వికెట్లు సాధించి రాణించారు. 106 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి బ్యాటర్లు ఆరంభం నుంచే దూకుడుగా ఆడారు. ఎస్‌వీ రాహుల్ 21 బంతుల్లో 40 పరుగులు, వై. సందీప్ 13 బంతుల్లో 30 పరుగులతో మెరిసి జట్టును కేవలం 11 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు.

నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయిన అమరావతి రాయల్స్ 9 ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. అద్భుత బౌలింగ్ ప్రదర్శన కనబర్చిన టోషిత్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

భారీ లక్ష్యాన్ని ఛేదించిన భీమవరం బుల్స్..

రెండో మ్యాచ్‌లో విజయవాడ సన్‌షైనర్స్, భీమవరం బుల్స్ జట్లు తలపడగా అభిమానులకు అసలైన టీ20 థ్రిల్లర్ కనిపించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విజయవాడ సన్‌షైనర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్లు మున్నంగి అభినవ్ 41 పరుగులు, అశ్విన్ హెబ్బార్ 124 పరుగులతో చెలరేగిపోయారు.

ముఖ్యంగా హెబ్బార్ కేవలం 58 బంతుల్లో శతకం సాధించి భీమవరం బౌలర్లపై బౌండరీల వర్షం కురిపించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో విజయవాడ జట్టు 214 పరుగుల భారీ స్కోరును అందుకుంది. అయితే 215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భీమవరం బుల్స్ ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.

కె. రేవంత్ రెడ్డి (31), తోట శ్రావణ్ (34) వేగంగా పరుగులు సాధించి మంచి ఆరంభం అందించారు. అనంతరం ఎం. ధీరజ్ కుమార్ విధ్వంసకర బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. కేవలం 22 బంతుల్లో 56 పరుగులు చేసి విజయవాడ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. మరోవైపు మునీష్ వర్మ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయానికి చేర్చాడు.

భీమవరం బుల్స్ 19.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. విజయవాడ బౌలర్లలో లలిత్, ప్రమోద్ చెరో రెండు వికెట్లు సాధించినప్పటికీ ఫలితం మారలేదు. కీలక సమయంలో వేగవంతమైన అర్ధశతకంతో మ్యాచ్ గమనాన్ని మార్చిన ధీరజ్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

విభిన్న విజయాలు..

మొత్తంగా రెండో రోజు ఏపీఎల్ పోటీలు రెండు విభిన్న చిత్రాలను ఆవిష్కరించాయి. ఒక మ్యాచ్‌లో అమరావతి రాయల్స్ ఏకపక్ష ఆధిపత్యం ప్రదర్శించగా, మరో మ్యాచ్‌లో భీమవరం బుల్స్ అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని ఛేదించి టోర్నీలో తమ సత్తా చాటింది.

Leave a Reply