విధి నిర్వహణలో అస్వస్థత..
పారిశుద్య కార్మికుడు మృతి
చెన్నూర్, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ముత్తురావుపల్లి గ్రామపంచాయతీలో పారిశుద్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న జాడి ప్రవీణ్ (30) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు.
సీఐ బన్సీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామపంచాయతీలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ నాలుగు రోజుల క్రితం గ్రామంలోని రహదారుల ఇరువైపులా పెరిగిన పిచ్చిమొక్కలకు కలుపు మందు పిచికారీ చేశాడు. అదే సమయంలో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లినట్లు తెలిపారు.
విధులు ముగించుకుని ఇంటికి వెళ్లిన అనంతరం ప్రవీణ్ అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రవీణ్ మృతి చెందినట్లు సీఐ తెలిపారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య సంధ్యారాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ బన్సీలాల్ వెల్లడించారు.
