డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : 1,500 మందికి జరిమానా, 17 మందికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు : 1,500 మందికి జరిమానా, 17 మందికి జైలు శిక్ష
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ. జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 1,500 మందిపై పోలీసులు, న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ గురువారం తెలిపారు. వీరికి మొత్తం రూ.33.94 లక్షల జరిమానా విధించడంతో పాటు 17 మందికి జైలు శిక్షలు పడినట్లు ఆయన వెల్లడించారు.
ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 28 వరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా ప్రధాన కూడళ్లు, పాఠశాలలు, కళాశాలల సమీపాలు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
తనిఖీల్లో పట్టుబడిన వారిని విచారించి సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించి, స్పెషల్ రిపోర్టుల ఆధారంగా కోర్టులో హాజరుపరచినట్లు చెప్పారు. అనంతరం న్యాయస్థానం 1,500 మందికి జరిమానాలు విధించగా, 17 మందికి జైలు శిక్షలు ఖరారు చేసినట్లు వివరించారు.
సబ్ డివిజన్ వారీగా చూస్తే నంద్యాల సబ్ డివిజన్‌లో 1,190 మంది పట్టుబడగా, వీరిలో 1,187 మందికి రూ.13,50,380 జరిమానా విధించబడింది. 3 మందికి సుమారు 15 రోజుల జైలు శిక్ష పడింది.
ఆళ్లగడ్డ సబ్ డివిజన్‌లో 139 మంది పట్టుబడగా, 136 మందికి రూ.3,73,500 జరిమానా విధించగా, 3 మందికి సుమారు 10 రోజుల జైలు శిక్ష పడింది.
డోన్ సబ్ డివిజన్‌లో 60 మంది పట్టుబడగా, 49 మందికి రూ.3.90 లక్షల జరిమానా విధించబడింది. 11 మందికి సుమారు 15 రోజుల జైలు శిక్ష విధించబడింది.
ఆత్మకూరు సబ్ డివిజన్‌లో 128 మంది పట్టుబడగా, వీరికి న్యాయస్థానం రూ.12.80 లక్షల జరిమానా విధించినట్లు ఎస్పీ తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల్లో మార్పు రావడం లేదని ఎస్పీ పేర్కొన్నారు. ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్నాయని, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్‌లో ప్రయాణం, అతివేగం ప్రధాన కారణాలుగా ఉన్నాయని తెలిపారు.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల కూడా అనేక ప్రాణనష్టాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
