Cyber Crime TG | ప్రతి లక్ష మందికి 713 సైబర్ నేరాలు
ఈజీ మనీ పేరుతో మోసాలు..
అప్రమత్తంగా ఉండాలని పోలీసుల హెచ్చరిక
Cyber Crime TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సైబర్ నేరాల ఉధృతి తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రతి లక్ష మంది జనాభాకు నమోదవుతున్న సైబర్ నేరాల సంఖ్యలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని అధికారులు వెల్లడించారు. ప్రతి లక్ష మందికి 713 సైబర్ నేరాలు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు.
సైబర్ నేరగాళ్లు అత్యాధునిక పద్ధతులతో ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా నకిలీ వెబ్సైట్ డాష్‌బోర్డులు రూపొందించి పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మిస్తున్నారు. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ వేదికలుగా ఈజీ మనీ, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ఆన్లైన్ టాస్కుల పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ తరహా ప్రకటనలను నమ్మి చాలామంది తమ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఓటీపీలు, డబ్బులను పంపి మోసపోతున్నారన్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి.అరవింద్ బాబు ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఈజీ మనీ, అధిక లాభాలు, త్వరగా సంపాదించండి వంటి ప్రకటనలను నమ్మవద్దని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. సైబర్ మోసాల నుంచి రక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండటమే ఉత్తమ మార్గమని పోలీసులు స్పష్టం చేశారు.
