మునుగోడులో 16వ ఉచిత కంటి వైద్య శిబిరం

11,650 మందికి పైగా కంటి పరీక్షలు.. 10 వేల శస్త్రచికిత్సలే లక్ష్యం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: మునుగోడు నియోజకవర్గంలో ఎవరూ కంటి చూపు సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉండాలనే లక్ష్యంతో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్, ఫీనిక్స్ ఫౌండేషన్, హైదరాబాద్ నానక్‌రాంగూడ శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ ముఖ్య నాయకులు, డీసీసీబీ అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పబ్బు రాజు గౌడ్ తెలిపారు.

ఆదివారం మునుగోడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో 16వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రారంభంలో కోమటిరెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన మాతృమూర్తి సుశీలమ్మ పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో ఉచిత కంటి వైద్య సేవలకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

ఇప్పటివరకు నిర్వహించిన 15 విడతల శిబిరాల్లో 11,654 మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 2,490 మందికి ఉచిత శస్త్రచికిత్సలు చేయించామని, 5,272 మందికి కండ్లజోళ్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో 10 వేల మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు చేయించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఆదివారం నిర్వహించిన 16వ శిబిరంలో 415 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, వారిలో 157 మందిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిని హైదరాబాద్‌లోని శంకర కంటి ఆసుపత్రికి ప్రత్యేక వాహనంలో ఉచితంగా తరలించారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.