రూ.52కే నాణ్యమైన సన్న బియ్యం..
వినియోగదారులకు కూటమి ప్రభుత్వం భారీ ఊరట
రాష్ట్రవ్యాప్తంగా 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ అవుట్లెట్లలో విక్రయాలు ప్రారంభం
రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
( పటమట, ఆంధ్రప్రభ ) : రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని విధాలుగా చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాలు కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం ఉదయం విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీ లో గల రైతు బజార్లో శాసనసభ్యులు గద్దె రామమోహన్, జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ బహిరంగ మార్కెట్లో గత నెల రోజులుగా బియ్యం ధరలు కిలోకు సుమారు రూ.10 వరకు పెరిగినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించిందని మంత్రి తెలిపారు. పౌర సరఫరాల శాఖ, ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రూ.52 కే బీపీటీ స్టీమ్ రైస్..
గతంలో కిలో రూ.64–65 వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్‌ను ప్రస్తుతం కేవలం రూ.52 కు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు.
రూ.50 కే బీపీటీ రా బియ్యం..
అదేవిధంగా గతంలో కిలో రూ.58–60 వరకు ఉన్న బీపీటీ రా (పచ్చి) బియ్యాన్ని రూ.50 కు కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ రాయితీ ధరల విక్రయాలు రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచే ప్రారంభమయ్యాయని వెల్లడించారు.
150 రైతు బజార్లు.. 500 రైస్‌మిల్ అవుట్లెట్లు..
రాష్ట్రంలోని 150 రైతు బజార్లు, 500 రైస్‌మిల్ అవుట్లెట్ల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు నాణ్యమైన బియ్యం అందుబాటులో ఉండటంతో పాటు బహిరంగ మార్కెట్లో ధరలపై నియంత్రణ ఏర్పడేలా ఈ చర్య దోహదపడుతుందని పేర్కొన్నారు.
దేశంలోనే వినియోగదారులకు ఇంత తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రత్యేకమైన కార్యక్రమమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు, కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మంత్రులు రైతు బజార్లు, రైస్‌మిల్ అవుట్లెట్ల వద్ద జరిగే ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కందిపప్పు, పామాయిల్ ధరలపైనా ప్రత్యేక దృష్టి…
భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ ధరల నియంత్రణపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వినియోగదారులపై నిత్యావసర వస్తువుల ధరల భారం పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వినియోగదారుల ప్రయోజనాలే లక్ష్యంగా ధరల స్థిరీకరణకు కూటమి ప్రభుత్వం నిరంతరం చర్యలు కొనసాగిస్తుందని మంత్రి పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటుందో గుర్తించి, ఆ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటుందనడానికి నేడు ప్రారంభమైన రూ.52 కు నాణ్యమైన బియ్యం విక్రయ కార్యక్రమమే నిదర్శనమన్నారు.
బియ్యం ధరలు రూ.100, రూ.125 వరకు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన ప్రజల్లో నెలకొన్న సమయంలో, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో కిలో సన్న బియ్యాన్ని కేవలం రూ.52 కు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. విజయవాడతో పాటు రాష్ట్రంలోని ప్రతి రైతు బజార్లోనూ ఈ నాణ్యమైన బియ్యం అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తగ్గించడంతో పాటు, మార్కెట్లో బియ్యం ధరలు మరింత పెరగకుండా నియంత్రించేందుకు, ఇప్పటికే పెరిగిన ధరల ప్రభావం సామాన్య ప్రజలపై పడకుండా చూడటానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని గద్దె రామమోహన్ పేర్కొన్నారు.
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతి క్యాబినెట్ సమావేశంలోనూ గత 15 రోజుల్లో ప్రజల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను తెలుసుకుని, వాటికి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నారని తెలిపారు. ప్రజావేదికతో పాటు మీడియా ద్వారా కూడా ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ప్రజలపై భారం పడకుండా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే రూ.52 కు సన్న బియ్యం అందుబాటులోకి తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు.
