Mla-Virupakshi-case : టెన్ష‌న్‌..టెన్ష‌న్‌.. Andhra Prabha Crime News

Mla-Virupakshi-case : టెన్ష‌న్‌..టెన్ష‌న్‌.. Andhra Prabha Crime News

  • ఎమ్మెల్యే విరూపాక్షిపై కేసు
  • తనయుడు స‌హా వైసీపీ శ్రేణుల‌పైనా
  • టీడీపీ నాయకుడిపై దాడి
  • వాహనం ధ్వంసంపై ఫిర్యాదు
  • నేమకల్లులో పోలీసుల భారీ బందోబస్తు

(కర్నూలు రూరల్ బ్యూరో, ఆంధ్రప్రభ)

Mla-Virupakshi-Base : చిప్పగిరి మండలం నేమకల్లు గ్రామంలో చోటుచేసుకున్న రాజకీయ ఘర్షణ కేసు కొత్త మలుపు తిరిగింది. అలూరు ఎమ్మెల్యే బి. విరూపాక్షి, ఆయన తనయుడు చంద్రశేఖర్‌తో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలిసింది.

శనివారం రాత్రి నేమకల్లు గ్రామంలో జరిగిన ఘర్షణ సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ కొండా పురుషోత్తంపై దాడి జరిగిందని, ఆయన వాహనంతో పాటు ఇంట్లోని వస్తువులను కూడా ధ్వంసం చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

తమ కార్యకర్త నుంచి ఫోన్ రావడంతో ఎమ్మెల్యే విరూపాక్షి భారీ సంఖ్యలో అనుచరులతో వాహనాల్లో నేమకల్లుకు చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఎమ్మెల్యే గ్రామానికి చేరుకున్న అనంతరం పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగినట్లు సమాచారం.

ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నేమకల్లు గ్రామంలో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది. కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు, అందిన ఫిర్యాదులు మరియు ఆధారాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.