వికలాంగురాలికి పెన్షన్‌..

  • అందించి మానవత్వం చాటిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌
  • ప్రజాదర్బార్‌లో వచ్చిన వినతిపై వెంటనే స్పందన..
  • కలెక్టర్‌తో కలిసి ఇంటికే వెళ్లి నగదు పంపిణీ
  • వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన అన్యాయాలను సరిదిద్దుతున్నాం: ఎమ్మెల్యే గద్దె

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు.

శనివారం 13వ డివిజన్‌లో నిర్వహించిన సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పూర్తిగా వికలాంగురాలైన కిలాని పద్మావతికి కొత్తగా మంజూరైన వికలాంగుల పెన్షన్‌ను జిల్లా కలెక్టర్ లక్ష్మీశ స్వయంగా అందజేశారు.

శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో పద్మావతి తల్లి వినతిపత్రం అందజేయగా, వెంటనే స్పందించిన జిల్లా యంత్రాంగం పెన్షన్‌ను మంజూరు చేసి మరుసటి రోజే నగదు అందజేయడం విశేషమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చిన్నచిన్న కారణాలు చూపుతూ అనేక మంది అర్హుల పెన్షన్లను నిలిపివేశారని ఆరోపించారు. అలాంటి అన్యాయాలను సరిదిద్దుతూ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

ప్రజాదర్బార్‌ ద్వారా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, సూపర్‌ స్ట్రక్చర్‌ పన్నుల సమస్యతో పాటు కొండ ప్రాంతాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఇబ్బందులను కూడా పరిష్కరించినట్లు తెలిపారు. మరిన్ని నిధులు సమీకరించి అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌, కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్‌ ఫారూఖ్‌ షుబ్లీ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హుల ఇంటి వద్దకే తీసుకెళ్లి అందిస్తున్నామని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పార్టీ నాయకులతో కలిసి 13వ డివిజన్‌లో నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.