ఆవిష్కరించిన విమానాశ్రయ డైరెక్టర్, మేనేజర్, ఈఓ శీనా నాయక్
సురక్షిత ప్రయాణం కోసం అమ్మవారి ఆశీస్సులు

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : జాతీయ అంతర్జాతీయ ప్రయాణాలు చేసే విమాన ప్రయాణికులకు (air passengers) కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో సురక్షిత ప్రయాణం జరిగేలా అమ్మవారి కరుణాకటాక్షాలు అందించేలా కనకదుర్గమ్మ ఆలయ అధికారులు విస్తృత చర్యలు చేపట్టారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి వార్ల దేవస్థానంలోని కనకదుర్గమ్మ (Kanakadurgamma) దివ్య దర్శనం ఇప్పుడు గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)లో కూడా లభించేలా ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దివ్యత్వాన్ని పెంచేందుకు ప్రయాణికులకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఏపీ రాజధాని అమరావతి (AP capital Amaravati)కి అతి ముఖ్యమైన గన్నవరం విమానాశ్రయంలో అమ్మవారి రెండు భారీ చిత్రపటాలను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం చేరుకున్న ప్రయాణికులకు, బయలుదేరే ప్రయాణికులకు అమ్మవారి దివ్య దర్శనం కల్పించడం ద్వారా వారి ప్రయాణం ఆశీర్వాదంతో సాగేలా ఏర్పాట్లు చేశారు.

విమానాశ్రయానికి ప్రయాణికులు చేరుకునే (అరైవల్) బ్లాక్‌లో ఒక భారీ చిత్రపటం, అలాగే బయలుదేరే (డిపార్చర్) బ్లాక్‌లో మరొక భారీ చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. గన్నవరం విమానాశ్రయంలో ఆదివారం జరిగిన కనకదుర్గమ్మ దివ్య చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉప ప్రధాన అర్చకులు శంకర్ శాండిల్య, అర్చకులు వెంపటి శ్రీధర్‌లతో కలిసి ఈఓ శీనా నాయక్ దేవస్ధాన సిబ్బంది (Devasthanam staff) ప్రత్యేక పూజలు నిర్వహించి ఆవిష్కరించారు.
అమరావతి ప్రాంతంలోకి అడుగుపెడుతున్న, దేశ విదేశాలకు ప్రయాణం అవుతున్న ప్రయాణికులు అమ్మవారి దర్శనం చేసుకొని, తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా కొనసాగించాలని ఈఓ ఆకాంక్షించారు. ఈ చర్య వల్ల కేవలం ఆలయ అభివృద్ధి (temple development) మాత్రమే కాకుండా, అమ్మవారి మహిమను మరింత విస్తృతం చేసినట్టవుతుందన్నారు. అమ్మవారి పేరును నూతన రాజధానిలో చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం (spiritual atmosphere) నెలకొల్పేందుకు మరింత కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విమానాశ్రయ డైరెక్టర్, మేనేజర్ తోపాటు, సెక్యూరిటీ ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పూజానంతరం విమానాశ్రయ డైరెక్టర్ మాట్లాడుతూ, ప్రయాణికులందరూ క్షేమంగా, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాలని, విమానాశ్రయ సేవలు మరింత మెరుగుపడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

