రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం సహించం: జాయింట్ కలెక్టర్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో నంద్యాల జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ శనివారం నంద్యాల సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో అందిస్తున్న సేవలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, పత్రాల నిర్వహణతో పాటు ఇటీవల ఏర్పాటు చేసిన డిజిటల్ సేవల పనితీరును ఆయన నిశితంగా పరిశీలించారు.

కార్యాలయంలో అమలవుతున్న ఆన్‌లైన్ సేవలు, పౌరులకు కల్పిస్తున్న సౌకర్యాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం రికార్డులు పరిశీలించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారమే ప్రతి సేవను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం, నిర్లక్ష్యం లేదా నిబంధనలకు విరుద్ధంగా జరిగే చర్యలు ఏవైనా తన దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు.

ప్రభుత్వ సేవలను పూర్తిగా డిజిటలీకరించడం ద్వారా అవినీతి, జాప్యాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజలకు సులభమైన, పారదర్శకమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఆకస్మిక తనిఖీతో కార్యాలయ సిబ్బంది అప్రమత్తమై, సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. తనిఖీలలో నంద్యాల సబ్ రిజిస్టర్ అజిమియా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.