రూ.1.49 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

ప్రతి డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం: నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ, ఆంధ్రప్రభ: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్‌లో సుమారు రూ.1.49 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తమ ప్రభుత్వం కేవలం శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలు ఏర్పాటు చేసే రాజకీయాలకు పరిమితం కాదని, ప్రారంభించిన ప్రతి పనిని నిర్దిష్ట గడువులో పూర్తి చేయించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పనుల పురోగతిపై అధికారులు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, వారం, పది రోజులు లేదా నెల రోజులకు మించకుండా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ప్రధాన ధ్యేయమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని చెప్పారు. ప్రతి డివిజన్‌కు కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు కేటాయిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి రుణపడి ఉన్నానని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తున్నానని నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల సహకారం ఎంతో అవసరమని, సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు ఇచ్చే సలహాలు, సూచనలను స్వాగతిస్తూ వాటిని పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.