గోదావరి పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

ఖానాపూర్ టౌన్, ఆంధ్రప్రభ : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సార్ఎస్పీ) గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఖానాపూర్ పట్టణ శివారులో ప్రవహిస్తున్న గోదావరి నది శుక్రవారం ఉద్ధృతంగా ప్రవహించింది. వరద ప్రవాహం పెరగడంతో నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ నదీతీరానికి వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా పశువుల కాపరులు, నదీతీరంలో మోటార్లు ఉన్న రైతులు, మత్స్యకారులు, పర్యాటకులు గోదావరి నదిలోకి లేదా నదీతీరానికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు. వరద పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.