భద్రాచలం వద్ద ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి
భద్రాచలం, ఆంధ్రప్రభ: అల్పపీడనం ప్రభావంతో గోదావరి నది, ఉపనదుల పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 8 గంటల నాటికి గోదావరి నీటిమట్టం 40.3 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎనిమిది లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. గురువారం సాయంత్రం 28.3 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం రాత్రికి రాత్రే 12 అడుగులకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతున్నందున నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన సహాయక చర్యలకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
