ఆంధ్ర టూ తెలంగాణ…. ఇసుక అక్రమ రవాణా

  • మూడు లారీలు, ఎస్కార్ట్ వాహనం సీజ్ చేసిన వైరా పోలీసులు
  • ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు
  • నలుగురు వ్యక్తుల అరెస్ట్

వైరా, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు లారీలతో పాటు, ఓ లారీకి ఎస్కార్ట్ వాహనంగా ఉన్న కారును వైరా పోలీసులు గురువారం రాత్రి పట్టుకొని సీజ్ చేశారు. ఈ అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన నలుగురు వ్యక్తులను మధిర కోర్టులో రిమాండ్ కు పంపారు. ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న వారు పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నిరంతరం లారీలు, ఎస్కార్ట్ వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్లు మార్చేందుకు వీరి వద్ద ఉన్న రేడియం స్టిక్కర్లు సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వైరా ఎస్ఐ తెలిపిన వివరాలు ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఇసుక రీచ్ నుంచి హైదరాబాద్ కు నిరంతరం ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. దీంతో గురువారం సాయంత్రం వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సోమవారం గ్రామ సమీపంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ హైవే ఎగ్జిట్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖిలో కొవ్వూరు నుంచి హైదరాబాద్ కు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న మూడు లారీలను, ఎస్కార్ట్ గా ఉన్న ఒక స్విఫ్ట్ డిజైర్ కారును పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు.

అంతేకాకుండా పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు లారీలు, ఎస్కార్ట్ గా ఉన్న కారు నెంబర్లను నిరంతరం మార్చేందుకు ఉపయోగించే రేడియం స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నల్గొండ జిల్లాకు చెందిన లారీ యజమానులు, డ్రైవర్లు ఇస్లావత్ భిక్షు, ముక్కుమాల యాదయ్య, దామ సైదులు, వాంకుడోత్ లింగా నాయక్, బచ్చబోయిన యాదయ్యలపై వైరా పోలీసులు కేసు నమోదు చేశారు.

వీరిలో బచ్చుబోయిన యాదయ్య పరారీలో ఉండగా మిగిలిన నలుగురిని అరెస్టు చేసి మధిర కోర్టులో రిమాండ్ కు పంపారు. ఈ సందర్భంగా ఎస్సై పుష్పాల రామారావు మాట్లాడుతూ అనుమతు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణా సమాచారాన్ని ప్రజలు పోలీసులకు అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.