బెల్లంపల్లి డివిజన్‌ను అతలాకుతలం చేసిన కుండపోత వర్షాలు

ఉప్పొంగిన వాగులు, వంకలు..

స్తంభించిన రాకపోకలు..

లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారుల హెచ్చరిక

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు గురువారం కూడా కుండపోతగా కొనసాగాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు చెరువులు నిండిపోయి పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది.

బెల్లంపల్లి పట్టణంలోని రాంనగర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాత జీమాపిస్తా నుంచి కాంట్రా చౌరస్తా వరకు గల ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రాంనగర్ వాగు ప్రవాహాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి రమేష్, తహసీల్దార్ ఎల్. కృష్ణ, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ కలిసి పరిశీలించారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.

కన్నెపల్లి మండలంలోని ఎర్రవాగు, నల్లవాగు, తాండూరు మండలంలోని మాదారం–3 ఇంక్లైన్, నర్సాపూర్, బెజ్జాల ప్రాంతాల్లో లోలెవల్ వంతెనలపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భీమిని మండలంలోని రాజారం పెద్దవాగు, చింతపూడి లింగాల వాగు, వేమనపల్లి మండలంలోని నీల్వాయి వాగు ఉప్పొంగడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

బెల్లంపల్లి మండలం చర్లపల్లి కాజ్వే, నార్వాయిపేట–ఆకెనపల్లి మధ్య పాలవాగు, కాసిపేట మండలంలోని పెద్దనపల్లి, సల్పల వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

పట్టణంలోని జాతికుంట చెరువు నిండిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరే ప్రమాదం ఏర్పడింది. దీంతో మున్సిపల్ చైర్‌పర్సన్ దావా స్వాతి రమేష్, కౌన్సిలర్ కంకటి ప్రణీత, కాంగ్రెస్ నాయకుడు కంకటి శ్రీనివాస్ నీటిని మరో వైపు మళ్లించి ప్రమాదాన్ని నివారించారు.

దేవాపూర్ గ్రామంలో సయ్యద్ సరోజనకు చెందిన పెంకుటిల్లు వర్షాల కారణంగా కూలిపోగా, ఎస్సై గంగారం సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

రూరల్ సీఐ సీహెచ్ హనోక్, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, మాదారం ఎస్సై సౌజన్య, వేమనపల్లి ఎస్సై కే. జగదీశ్వర్ రెడ్డి, కాసిపేట ఎస్సై ఆంజనేయులు, కౌన్సిలర్లు చింతల వసంత, బేతి శ్రావణ్, కొక్కుల రాంమూర్తి తదితరులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.