సబ్ స్టేషన్ లోకి చేరిన వరద నీరు..
అవస్థలు పడుతున్న ఉద్యోగులు..
రాత్రి వేళలో నరకయాతన..
జన్నారం,ఆంధ్రప్రభ: రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి గురువారం సాయంత్రం మంచిర్యాల జిల్లా జన్నారం 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లోకి వరద నీరు చేరింది. ప్రస్తుతం ఆఫీసు, ఉద్యోగులు ఉండే భవనం చుట్టూ వరద నీరు చేరడంతో ఉద్యోగుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇలానే ఇంకా వర్షం కురిస్తే విద్యుత్ సబ్ స్టేషన్ లోకి వరద నీరు చేరే అవకాశాలు ఉన్నాయి. వర్షం ఎక్కువై వరద నీరు సబ్ స్టేషన్ లోకి చేరినట్లయితే ప్రమాదం పొంచి ఉంది.ప్రస్తుతం సబ్ స్టేషన్ లో విధులు నిర్వహించే ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. సాయంత్రమే ఇలా ఉంటే రాత్రి పరిస్థితి ఎలా ఉంటుందోనని పలువురు ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు.
విద్యుత్ సబ్ స్టేషన్ లో అన్నీ సమస్యలే..
జన్నారం విద్యుత్ సబ్ స్టేషన్ లో పలు సమస్యలతో ఉద్యోగులు సతమతమవుతున్నారు.అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం వల్ల చుట్టూ కాంపౌండ్ వాల్ లేక రాత్రి వేళలో ఎలుగుబంట్లు వచ్చి ఉద్యోగులపై దాడి చేసిన సంఘటనలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ తాత్కాలికంగా పోల్స్ వేసి,చుట్టూ జాలి వైర్లు వేయాల్సి ఉండగా,జాప్యం చేస్తున్నాడని,విద్యుత్ స్టేషన్ చుట్టూ భద్రత జాలి కూడా లేదని ఏర్పాటు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.రాత్రి విధుల్లో ఉన్న ఉద్యోగులు పడుకోవడానికి ఉన్న భవనం శిథిలావస్థకు చేరింది.ఆ భవనంలో రాత్రి ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ నిద్రిస్తున్నారు.విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వెంటనే జన్నారం సబ్ స్టేషన్ లోని సమస్యలన్నీ పరిష్కరించాలని పలువురు కోరారు.ఈ విషయమై ఇన్చార్జి ఏఈ సాయిశృతిక్ ను సాయంత్రం ప్రశ్నించగా, సబ్ స్టేషన్ లో ఉన్న సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రస్తుతం విద్యుత్ సబ్ స్టేషన్ లోకి నీరు చేరిందని,ఆ నీరు మరింత ఎక్కువై విద్యుత్ సరఫరా చేసే స్టేషన్లోకి చేరినట్లయితే జన్నారం టౌన్ కు విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నట్లు ఆయన తెలిపారు.
