మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నాం..
- వారి సంక్షేమం ఉపాధికి ప్రభుత్వం పెద్దపీట
- తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు
తిరువూరు, ఆంధ్రప్రభ : మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబన, ఉపాధి కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. గురువారం తిరువూరు నియోజకవర్గంలోని తన కార్యాలయంలో నాలుగు మండలాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం తిరువూరులో ఏర్పాటు చేసిన వన్‌స్టాప్ సెంటర్లో ఎంపికైన స్థానిక మహిళలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్యతో పాటు గర్భిణులు, బాలింతల సంక్షేమంలో అంగన్వాడీ కార్యకర్తలు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.

అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పోషకాహారం అందించడంతో పాటు పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. తిరువూరులో వన్‌స్టాప్ సెంటర్ ఏర్పాటు మహిళల రక్షణ, సాధికారతకు కీలక ముందడుగని పేర్కొన్నారు. మహిళలకు అవసరమైన కౌన్సెలింగ్, న్యాయ సహాయం, రక్షణ, పునరావాసం వంటి సేవలు ఒకే కేంద్రంలో అందుబాటులోకి రావడం వల్ల బాధిత మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. అదే సమయంలో స్థానిక మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందన్నార మహిళలు కుటుంబానికి, సమాజానికి వెన్నెముకలని పేర్కొన్న ఎమ్మెల్యే, మహిళల ఆరోగ్యం, భద్రత, ఆత్మగౌరవం, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.
పిల్లల విద్య, ఆరోగ్యం, విలువల పెంపకంలో తల్లిదండ్రులు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమం, పేదల అభ్యున్నతి, ఉపాధి అవకాశాల కల్పన, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ముందుకు సాగుతోందని కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుతో పాటు అంగన్వాడీ కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
