త్వరితగతిన కేసుల పరిష్కారానికి టెక్నాలజీని వినియోగించాలి

విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించిన కరీంనగర్ సీపీ గౌస్ ఆలం

గంగాధర, ఆంధ్రప్రభ : అందుబాటులో ఉన్న టెక్నాలజీని సమర్థంగా వినియోగించి కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం సూచించారు. గురువారం చొప్పదండి సర్కిల్ పరిధిలోని గంగాధర పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు.

మొదట పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటిన సీపీ, అనంతరం సిబ్బందితో సమావేశమై వారికి కేటాయించిన విధులు, నిర్వహణ తీరుపై ఆరా తీశారు. స్టేషన్‌లో రికార్డులను సక్రమంగా నిర్వహించడంతో పాటు నమోదైన కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.

తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న సీసీటీఎన్‌ఎస్, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ-సమన్ల జారీ, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్ వంటి అప్లికేషన్‌లపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని, రోజువారీ విధుల్లో సమర్థంగా వినియోగించాలని సూచించారు.

ఎఫ్‌ఐఆర్ ఇండెక్స్‌ను పరిశీలించిన సీపీ, పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. కేసులు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలను తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

మండలంలో నమోదైన సైబర్ నేరాలపై వివరాలు తెలుసుకున్న సీపీ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లు, సబ్‌సెక్టార్లుగా విభజించి, వాటికి గ్రామ పోలీసు అధికారులను కేటాయించాలని ఆదేశించారు.

రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ప్రతి నెల వారి తాజా వివరాలను నమోదు చేసి పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్ కుమార్, గంగాధర ఎస్‌ఐ వంశీకృష్ణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.