కనీస వేతనం చట్టం అమలు చేయాలి…

సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నిరసన


మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కనీస వేతనం చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ (CITU) ఆధ్వర్యంలో పది కార్మిక సంఘాలు గురువారం కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయం ఎదుట ఉన్న ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి.

ఈ సందర్భంగా సంఘాల నాయకులు మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ అనుబంధ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులను శాశ్వతీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే కార్మికులకు కనీస వేతనంగా నెలకు రూ.26,000 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా సేవలందిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తగిన వేతనాలు, సంక్షేమ సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని నాయకులు పి.సుబ్బారావు, ఎం పోల్ నాయుడు పేర్కొన్నారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.