ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆరోగ్య శిబిరం…

ఉచిత మెగా గుండె వైద్య శిబిరం
ఎంపీ కేశినేని శివనాద్ ఆధ్వర్యంలో.
రేపు గురునానక్ కాలనీలో నిర్వహణ
ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఆకాష్ పల్లెం సేవలు
ఉచిత ఈసీజీ, 2డీ ఎకో పరీక్షలు
అవసరమైన వారికి ఉచిత మందులు,
ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా యాంజియోగ్రామ్ అవకాశం

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సౌజన్యంతో మంగళవారం ఉచిత మెగా గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. విజయవాడ లోని గురునానక్ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ శిబిరం జరగనుంది. ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. ఆకాష్ పల్లెం ఆధ్వర్యంలో నిర్వహించే ఈ శిబిరంలో గుండె సంబంధిత వ్యాధులు, ఆయాసం, గుండె దడ, గుండె నొప్పి, ఛాతిలో మంట, ఎడమ చేతి నొప్పి, అలాగే దీర్ఘకాలిక బీపీ, మధుమేహం సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించనున్నారు.

శిబిరంలో భాగంగా ఉచిత ఈసీజీ పరీక్షలు, ఉచిత 2డీ-ఎకో గుండె స్కానింగ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నారు. వైద్య నిపుణుల సూచన మేరకు ఎంపికైన వారికి సుమారు రూ.13 వేల విలువైన యాంజియోగ్రామ్ పరీక్షను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించే అవకాశాన్ని కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అర్హులైన ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. శిబిరంలో రద్దీని నివారించేందుకు ముందస్తు నమోదు చేసుకోవాలని సూచించింది. వివరాలు, అపాయింట్‌మెంట్ కోసం 804512912 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.