అంతర్జాతీయ క్రికెట్‌కు అజింక్య రహానే వీడ్కోలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: టీమిండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాడు. ఇక ముందుకు సాగే సమయం వచ్చిందని, తన కెరీర్‌కు ముగింపు పలకాల్సిన సరైన సమయం ఇదేనని రహానే పేర్కొన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియో సందేశంలో రహానే భావోద్వేగంగా స్పందించాడు. “ప్రతి ప్రారంభానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దానిని గౌరవించి ముందుకు సాగాలి. బ్యాటింగ్‌లో టైమింగ్‌ను ఎంతగా నమ్మానో, జీవితంలో కూడా సరైన సమయాన్ని అంతే గౌరవిస్తాను” అని చెప్పాడు. తన పోస్టుకు “క్యాప్ నంబర్ 278… సైనింగ్ ఆఫ్” అనే క్యాప్షన్‌ను జత చేశాడు.
రహానే చివరిసారిగా 2023లో వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులో చోటు దక్కకపోయినా, తిరిగి జాతీయ జట్టులోకి రావాలన్న ఆశను ఈ ఏడాది ఐపీఎల్ వరకు కొనసాగించాడు. 38 ఏళ్ల రహానే తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 85 టెస్ట్‌లు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్ట్‌లలో 5,077 పరుగులు చేసి 12 సెంచరీలు, 26 అర్ధశతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 2,962 పరుగులతో మూడు సెంచరీలు, 24 అర్ధశతకాలు సాధించాడు. టీ20ల్లో 375 పరుగులు చేశాడు.
2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక స్కోరు నమోదు చేయడం అతని చివరి గుర్తుండిపోయే ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. అయితే రహానే కెరీర్‌లో అత్యంత చిరస్మరణీయ ఘట్టం 2020-21 ఆస్ట్రేలియా పర్యటన. తొలి టెస్ట్ అనంతరం విరాట్ కోహ్లీ స్వదేశానికి తిరిగి వెళ్లడంతో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రహానే, గాయాలతో సతమతమైన భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో చారిత్రక టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించి భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు.
