ఉద్యోగాలు ఇవ్వని వైసీపీకి.. విమర్శించే హక్కుందా?: అరవింద బాబు

16,600 టీచర్ పోస్టులు, 7 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం
‘రెండేళ్ల నమ్మకం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవింద బాబు విమర్శలు

నరసరావుపేట, ఆంధ్రప్రభ: గత ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ నేతలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు విమర్శించారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘రెండేళ్ల నమ్మకం – సంక్షేమం, అభివృద్ధి’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని బరంపేట 32, 33 వార్డుల్లో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, స్థానిక సమస్యలను తెలుసుకుని అధికారులకు పరిష్కార చర్యలు సూచించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ‘తల్లికి వందనం’, ‘అన్నదాత సుఖీభవ’, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి పథకాల లబ్ధి అందని వారికి సచివాలయ సిబ్బంది ద్వారా వెంటనే పరిష్కారం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, తాగునీరు, డ్రైనేజీ వంటి స్థానిక సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు.

వైసీపీపై విమర్శలు..

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైనే పోరాటం చేశామని, సహేతుకమైన కారణాలు ఉన్నప్పుడే ఉద్యమాలు చేపట్టామని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్సీ నిర్వహించకపోగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 16,600 మంది ఉపాధ్యాయులకు ఉద్యోగాలు, 7 వేల మంది కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టిందన్నారు. ఈ నియామకాలను జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, ఇటీవల నిర్వహించిన ధర్నాకు ప్రతిస్పందనగా త్వరలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యం..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని తెలిపారు.

ఇటీవల నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం ద్వారా సుమారు రూ.3,216 కోట్ల రుణాలను లక్ష మందికి పైగా లబ్ధిదారులకు అందించామని చెప్పారు. చిరు వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారులు, ఎంఎస్‌ఎంఈలు, పాల ఉత్పత్తిదారులు తదితర వర్గాలకు ఈ రుణాలు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

అమరావతి రాజధాని నిర్మాణం, సీడ్ యాక్సిస్ రోడ్డు, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటి సరఫరా వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గట్టుపల్లి సత్యన్నారాయణ, కొట్టా కిరణ్ కుమార్, రామకృష్ణ, పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వార్డు నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.