కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్..
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్..
ఏప్రిల్ 15 వరకు రిజిస్ట్రేషన్లకు గడువు
పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కేంద్రీయ విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒకటవ తరగతి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉన్న కేవీ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించాలనుకునే తల్లిదండ్రుల కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రవేశాలు పూర్తిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారానే జరుగుతాయి. కాబట్టి నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవడం అత్యంత ముఖ్యం.
షెడ్యూల్ ఇలా…!
షెడ్యూల్ ప్రకారం, ఒకటవ తరగతి ప్రవేశాల కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులు ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రవేశం కోరే నాటికి, అంటే మార్చి 31, 2026 నాటికి విద్యార్థికి కనీసం 6 సంవత్సరాల వయస్సు నిండివుండాలి. వయస్సు నిబంధన విషయంలో కేవీఎస్ కఠినంగా వ్యవహరిస్తుంది. అందువల్ల దరఖాస్తు చేసేముందు జనన ధృవీకరణ పత్రాన్ని సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక
రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక, కేవీఎస్ లాటరీ విధానంలో ఎంపికైన విద్యార్థుల జాబితాను విడుదల చేస్తుంది. మొదటి జాబితా ఏప్రిల్ మూడవ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు, ఆర్టీఈ కోటా కింద బలహీన వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యత ఇస్తారు. సీట్లు ఖాళీగా ఉంటే రెండో, మూడో జాబితాలను కూడా విడుదల చేస్తారు.
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాల్లో విద్యార్థి జనన ధృవీకరణ పత్రం, ఫోటో, నివాస ధృవీకరణ పత్రం, అవసరమైతే కుల ధృవీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులైతే సర్వీస్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఈ ప్రక్రియ అంతా కేవీఎస్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. దరఖాస్తుకు ఎటువంటి రుసుము లేదు.
కేవీ స్కూళ్లకు విపరీతమైన పోటీ
ఉన్నత ప్రమాణాల విద్య, తక్కువ ఫీజులు ఉండటంతో కేవీ స్కూళ్లకు భారీ పోటీ ఉంది. కాబట్టి గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవడం మంచిది. ఒకటవ తరగతి కాకుండా ఇతర తరగతుల్లో (2 నుంచి 10 వరకు) ప్రవేశాలు ఖాళీల ఆధారంగా ఆయా పాఠశాలల్లో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రవేశాలపై సందేహాలు ఉంటే సమీప కేంద్రీయ విద్యాలయ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి
ఉమ్మడి గుంటూరు జిల్లాలో నల్లపాడు, తెనాలి, సత్తెనపల్లి, సూర్యలంక, చిలకలూరిపేట మండలం ఇర్లపాడు గ్రామాల్లో కేంద్రీయ విద్యాలయాలు పనిచేస్తున్నాయి. పల్నాడు జిల్లాలో నరసరావుపేట, మాచర్లలో కొత్తగా మంజూరైన కేంద్రీయ విద్యాలయాల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది. దీనిపై పూర్తి సమాచారం త్వరలో వెలువడనుంది.
ఈ ఏడాది నుంచి సత్తెనపల్లి కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ విద్యను కూడా ప్రారంభించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అదనంగా సత్తెనపల్లి, ఇర్లపాడు కేవీఎస్ పాఠశాలల్లో కొత్త సెక్షన్లు మంజూరు చేయడంతో సీట్ల సంఖ్య పెరగనుందని అధికారులు తెలిపారు.
ఇంటర్ ప్రవేశాలకు 10వ తరగతి (CBSE) ఫలితాలు వెలువడిన పది రోజుల తర్వాత ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తామని వివరించారు.
