భీమేశ్వర ఆలయంలో వరుణయాగానికి సర్వం సిద్ధం

ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్..

మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు

వేములవాడ, ఆంధ్రప్రభ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లోకకళ్యాణార్థం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పిస్తూ మూడు రోజులపాటు నిర్వహించనున్న వరుణయాగానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకు శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సత్వర సద్యఃసువృష్టి (సకాల వర్షప్రాప్తి) కోసం ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణయాగం, వరుణ పర్జన్య జపానుష్ఠానాలు, హవనాలు, శ్రీ భీమేశ్వర స్వామివారికి సంతత ధారాభిషేకం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

జూలై 30న ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, ఋశ్యశృంగ ప్రతిష్ఠ, వరుణ జపాలు, సంతత ధారాభిషేకం, వరుణయాగ హోమం, జపానుష్ఠానాలు నిర్వహించనున్నారు. అలాగే దేవస్థానం పరివార, అనుబంధ ఆలయాల్లో మూడు రోజులపాటు ప్రత్యేక పూజలు, విరాటపర్వ పారాయణాలు, ప్రవచన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

వరుణయాగ మహోత్సవాలకు హాజరయ్యే భక్తులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎలాంటి అసౌకర్యం ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆది శ్రీనివాస్ ఆదేశించారు.

అనంతరం ఆయన శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ ఈవో రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.

అలాగే ఆలయ ప్రాంగణంలోని కోడెలకు పచ్చిగడ్డి, కోతులకు అరటిపండ్లు తినిపించారు. రానున్న మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణపై ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో డీఈవో నవీన్ కుమార్, ఏఈఓలు జయకుమారి, నాగుల మహేష్, లక్ష్మణరావు, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, పెరిక శ్రీనివాస్, శివసాయి, సీనియర్ అసిస్టెంట్ వంశీ మోహన్ శర్మ, నక్క తిరుపతి తదితరులు పాల్గొన్నారు.