దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి పార్టీని బలోపేతం చేద్దాం..

జనసేన శ్రేణులకు బాలినేని పిలుపు

చిలకలూరిపేటలో జనసేన భారీ ర్యాలీ.. పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా శ్రేణుల తరలివచ్చిన నాయకులు

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని క్షేత్రస్థాయిలో తిప్పికొట్టాలని, నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నిర్మాణ సారథుల పరిశీలకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.

చిలకలూరిపేట పట్టణంలోని శ్రీనివాస ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జనసేన నియోజకవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సమావేశానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ ఆధ్వర్యంలో జనసైనికులు ఘన స్వాగతం పలికారు. నరసరావుపేట రోడ్డులోని ఫ్లైఓవర్ సెంటర్ వద్ద భారీ పూలమాలతో సత్కరించిన అనంతరం వందలాది బైక్‌లు, వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ సందర్భంగా జనసైనికులు “జై జనసేన”, “పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు. బాణాసంచా పేలుళ్లు, డప్పు వాయిద్యాల నడుమ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, చిలకలూరిపేటలో జనసేన శ్రేణుల ఉత్సాహం పార్టీ విజయాన్ని గుర్తు చేస్తోందని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని ప్రతి కార్యకర్త ప్రజల్లో సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. నాయకులు విభేదాలు పక్కనబెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ మాట్లాడుతూ, చిలకలూరిపేటలో జనసేన ఎల్లప్పుడూ ప్రజాపక్షాన నిలుస్తుందని తెలిపారు. భారీ సంఖ్యలో తరలివచ్చి ర్యాలీని విజయవంతం చేసిన జనసైనికులు, వీరమహిళలకు కృతజ్ఞతలు తెలిపారు.

బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తామని, అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. వైసీపీ నేతల అసత్య ప్రచారాలను తిప్పికొట్టడంలో చిలకలూరిపేట జనసేన శ్రేణులు ఎప్పుడూ ముందుంటాయని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.