పంటల బీమాలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి: కలెక్టర్ కృతిక శుక్లా

  • పత్తి బీమా ప్రీమియం చెల్లింపునకు జూలై 31 వరకు గడువు..
  • ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా రైతులకు సూచన

నరసరావుపేట, ఆంధ్రప్రభ: జిల్లాలోని రైతులు తప్పనిసరిగా పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు. పంటల బీమాపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె పలు కీలక సూచనలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పండుమిరప, పత్తి పంటలకు జూలై 31లోగా, వరి పంటకు ఆగస్టు 15లోగా బీమా ప్రీమియం చెల్లించాలని సూచించారు. పత్తి పంట బీమా ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు.

ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి రైతులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని సూచించారు. వరి, పండుమిరప, కంది పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద, పత్తి పంట పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద అమలులో ఉన్నాయని తెలిపారు.

2026–27 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు జెనరలి సెంట్రల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఐఎఫ్‌ఎఫ్‌సీఓ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని నియమించినట్లు వెల్లడించారు.

రైతులు వరి పంటకు ఎకరాకు రూ.80, పండుమిరపకు రూ.360, కందికి రూ.40, పత్తి పంటకు రూ.1,900 చొప్పున ప్రీమియం చెల్లించాలని తెలిపారు. అర్హులైన రైతులు సాగు చేసిన నోటిఫైడ్ పంటలకు వర్తించే పథకం ప్రకారం నిర్ణీత గడువులోగా బీమా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, అధిక వర్షాలు తదితర కారణాలతో కలిగే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ పేర్కొన్నారు.

రైతులు తమ సమీప వ్యవసాయ శాఖ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా సంబంధిత బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి పంటల బీమాలో నమోదు చేసుకోవచ్చన్నారు.

పంటల బీమా మార్గదర్శకాలు, ప్రీమియం రేట్లు, నోటిఫైడ్ పంటలు, అమలు సంస్థల వివరాలు, నమోదు గడువుకు సంబంధించిన పూర్తి సమాచారం మండల వ్యవసాయ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉందని, అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ కృతిక శుక్లా కోరారు.