Sports Quota | స్పోర్ట్స్ కోటాను లక్ష్యంగా చేసుకున్న దుష్ప్రచారం!
Sports Quota | స్పోర్ట్స్ కోటాను లక్ష్యంగా చేసుకున్న దుష్ప్రచారం!
Sports Quota | నిరుద్యోగుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం..
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇవ్వని శాప్ ఇవ్వదు..
ఇచ్చేది ఫెడరేషన్లు, యూనివర్సిటీలే
నియామక ప్రక్రియలో ప్రజాప్రతినిధుల ప్రమేయం శూన్యం..
అధికారులే తుది నిర్ణయాధికారులు
కష్టపడి మెడల్స్ సాధించిన క్రీడాకారులపై విమర్శలు దారుణం..
ఆంధ్రప్రభ తో శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు
Sports Quota | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : డీఎస్సీ నియామకాలపై వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ లబ్ధి కోసమే విష ప్రచారం చేస్తున్నారంటూ శాప్ చైర్మన్ ఏ రవి నాయుడు మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్న డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాల వ్యవహారంపై షాప్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్) చైర్మన్ ఏ. రవి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ నియామకాలపై జరుగుతున్న విమర్శలు, ఆరోపణలు వాస్తవాల ఆధారంగా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నవని ఆయన ఆరోపించారు. నిరుద్యోగుల పట్ల ప్రేమతో కాకుండా ప్రభుత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యవస్థీకృత ప్రచారం సాగిస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రభకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రవి నాయుడు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వరుసగా కొత్త కొత్త ఆరోపణలు తెరపైకి తీసుకొస్తున్నారని పేర్కొన్నారు.
మొదట ర్యాంకర్లకు అన్యాయం జరిగిందని, ఆ తర్వాత పేపర్ లీకేజీ జరిగిందని, తర్వాత రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయని, ఇప్పుడు స్పోర్ట్స్ కోటాను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూపిస్తూ ప్రజల్లో అనుమానాలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని వ్యాఖ్యానించారు. స్పోర్ట్స్ కోటా అంశం ప్రజలకు త్వరగా చేరువయ్యే భావోద్వేగ అంశం కావడంతో దానిని ప్రత్యేకంగా టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు. సినిమా, క్రీడలు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటాయని, అందుకే స్పోర్ట్స్ కోటాపై తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జారీ వ్యవస్థపై వస్తున్న విమర్శలను ఖండించిన రవి నాయుడు, షాప్ ఎలాంటి సర్టిఫికెట్లు జారీ చేయదని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడా సంఘాలు, గుర్తింపు పొందిన ఫెడరేషన్లు, యూనివర్సిటీలు నిర్వహించే పోటీల్లో సాధించిన విజయాల ఆధారంగానే సర్టిఫికెట్లు జారీ అవుతాయని తెలిపారు.
షాప్ పాత్ర కేవలం ధృవీకరణ, సమన్వయం వరకే పరిమితమని, సర్టిఫికెట్లు సృష్టించడం లేదా జారీ చేయడం తమ అధికార పరిధిలో లేదన్నారు. బ్రిడ్జ్ గేమ్ అంశంపై వస్తున్న విమర్శలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో సంబంధిత అసోసియేషన్ లేకుండా సర్టిఫికెట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం పొందడం అసాధ్యమని, అయినప్పటికీ వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం విచారకరమన్నారు. స్పోర్ట్స్ కోటా సీట్లు అమ్ముడయ్యాయన్న ఆరోపణలపై స్పందిస్తూ, “ఎవరికి అమ్మారు? ఎవరు కొనుగోలు చేశారు? ఎక్కడ ఆధారాలు ఉన్నాయి?” అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక్క ఆధారం కూడా చూపకుండా ఆరోపణలు చేయడం రాజకీయ దురుద్దేశాన్ని మాత్రమే సూచిస్తోందన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా సాగిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి కమిటీలు, ఐఏఎస్ అధికారులు, విద్యాశాఖ, క్రీడాశాఖ ప్రతినిధులు, ఫెడరేషన్ సభ్యులు కలిసి బహుళస్థాయి పరిశీలన నిర్వహించారని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణకు గ్రీవెన్స్ వ్యవస్థ కూడా అమలు చేశామని చెప్పారు.
ఒక క్రీడాకారుడు మరొకరి అర్హతపై అభ్యంతరం తెలిపే అవకాశాన్ని కూడా కల్పించామని వెల్లడించారు. ప్రజాప్రతినిధుల జోక్యం జరిగిందన్న ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చిన రవి నాయుడు, ఈ మొత్తం ప్రక్రియలో రాజకీయ నాయకుల ప్రమేయం “జీరో శాతం” అని స్పష్టం చేశారు. నియామకాల ప్రక్రియ పూర్తిగా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలోనే జరిగిందని, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకునే అవకాశం కూడా లేదన్నారు. ఇటీవల వైరల్ అయిన ఆడియో వివాదంపై మాట్లాడుతూ, సంబంధిత వ్యక్తిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదై అరెస్టు జరిగిందని తెలిపారు. ఆరోపణలు చేసిన వ్యక్తి గతంలో కూడా పలు వివాదాల్లో ఉన్నాడని పేర్కొన్నారు. ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యల ఆధారంగా మొత్తం నియామక వ్యవస్థను అపవాదులకు గురిచేయడం సరికాదన్నారు. క్రీడాకారుల మనోభావాలపై జరుగుతున్న దాడి అత్యంత బాధాకరమని రవి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో కష్టాలు పడి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులు నేడు అనుమానాల నీడలో నిలబడాల్సి వస్తోందన్నారు. రాజకీయ యుద్ధాలు వేరని, క్రీడాకారుల ప్రతిష్టను బలి చేయడం అన్యాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పారదర్శక పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆన్‌లైన్ విధానాల ద్వారా అవినీతికి తావులేకుండా చర్యలు చేపట్టామని రవి నాయుడు స్పష్టం చేశారు. వాస్తవాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్న రాజకీయ సంస్కృతి ప్రజల ముందు నిలవదని, నిజాలు చివరకు వెలుగులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు
