24 గంటలూ జనంలోనే ఉంటా..
- నవంబర్‌లో నా పొలిటికల్ డిజైన్ ప్రకటిస్తా
- నా మనసులో ఓ రాజకీయ కోరిక ఉంది
- టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
- ఇప్పటికే రాజకీయ ప్రణాళిక సిద్ధంగా ఉందని సంచలన వ్యాఖ్యలు
- రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో మరోసారి ఆసక్తికర చర్చ..
- జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ !!
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలపై గత మూడున్నరేళ్లుగా తాను ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదని, అందుకు కారణం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడించారు. సంగారెడ్డిలో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
జూలైలో కీలక ప్రకటన చేస్తానని అంతకుముందు చెప్పిన ఆయన, మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యేలా వ్యాఖ్యలు చేశారు. తాను ఏ విషయమైనా మాట్లాడాల్సి వస్తే ముందుగా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే బయట మాట్లాడతానని స్పష్టం చేశారు. మనసులో ఒకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడే వ్యక్తిని తాను కాదని పేర్కొన్నారు.
మూడున్నరేళ్ల క్రితం పార్టీలో లోపాలు ఉన్నప్పుడు వాటిని బహిరంగంగానూ, అంతర్గతంగానూ చర్చించానని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం పీఏసీ సమావేశాల్లో చర్చించిన విషయాలు కూడా బయటకు వస్తుండటంతో ఆ సమావేశాలకు వెళ్లడం మానేశానని తెలిపారు. తాను సమావేశానికి హాజరై ఉంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఏఐసీసీ ఇన్‌చార్జి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేవాడినని, కానీ తాను మాట్లాడిన అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండటంతో దూరంగా ఉన్నానని చెప్పారు.
ఎన్నికలకు ముందు ఢిల్లీలో రాహుల్ గాంధీ 40 మంది కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించగా, తనకూ ఆహ్వానం అందిందన్నారు. ఆ సందర్భంగా రాహుల్ గాంధీతో సుమారు 15 నిమిషాల పాటు మాట్లాడానని తెలిపారు. సంగారెడ్డి రాంనగర్‌లోని రామ్ మందిర్ నుంచి విద్యార్థి నేతగా ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం, ఢిల్లీలో రాహుల్ గాంధీ నివాసంలో ఆయన ఎదుట కూర్చునే స్థాయికి చేరిందని చెప్పానన్నారు.
గాంధీల కుటుంబం పదవులకతీతం
ప్రధానమంత్రి పదవిలో ఎవరు ఉన్నా అధికారంలో ఉన్నంతకాలమే ప్రజలు గుర్తుంచుకుంటారని, కానీ పదవులకు అతీతంగా గుర్తుండిపోయే కుటుంబం గాంధీ కుటుంబమని రాహుల్ గాంధీతో చెప్పినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు. ఎవరి పట్లైనా అసంతృప్తి లేదా కోపం ఉంటే మీడియా ముందు మాట్లాడకుండా నేరుగా ఢిల్లీకి వచ్చి తనతో మాట్లాడాలని రాహుల్ గాంధీ సూచించారని చెప్పారు. ఆ మాటకు గౌరవం ఇచ్చే ఉద్దేశంతోనే గత మూడున్నరేళ్లుగా పార్టీ లేదా ప్రభుత్వ వ్యవహారాలపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
ఆ రాజకీయ కోరిక ఏమిటి?
రాజకీయంగా తన మనసులో ఒక కోరిక ఉందని, ఇప్పటికే ఒక రాజకీయ ప్రణాళిక సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆ “పొలిటికల్ డిజైన్”ను నవంబర్‌లో వెల్లడిస్తానని ప్రకటించారు. రాబోయే మూడు నెలల్లో రాజకీయంగా తనకు పూర్తి స్పష్టత వస్తుందని చెప్పారు. తనకు కుటుంబం కంటే ప్రజలే, రాజకీయాలే ముఖ్యమని, తాను 24 గంటలూ ప్రజలు, రాజకీయాల గురించే ఆలోచిస్తానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చకు దారితీశాయి.
