దక్షిణాది కథలపై ‘స్టోరీ టీవీ’ ఫోకస్.. తెలుగుకు ప్రత్యేక ప్రాధాన్యం
- 2027 నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు
- తెలుగు ఒరిజినల్ కంటెంట్‌కు పెద్దపీట…
- దక్షిణాది భాషల్లో స్థానిక కథలతో ముందుకు సాగుతున్న ఎలోఎలో గ్రూప్
ఆంధ్రప్రభ, హైదరాబాద్ : భారత్‌లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్రో డ్రామా ప్లాట్‌ఫామ్ స్టోరీ టీవీ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తన అడుగులను మరింత బలోపేతం చేస్తోంది. ఎలోఎలో గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ 2027 మార్చి నాటికి దక్షిణ భారత భాషల్లో 1,000కు పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇందులో తెలుగు కంటెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనుంది.
ఈరోజు ప్రేక్షకులు మొబైల్‌లోనే వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో తమ భాషలో, తమ సంస్కృతికి, తమ జీవితాలకు దగ్గరగా ఉండే కథలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ మారుతున్న అభిరుచిని దృష్టిలో పెట్టుకుని, తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా పూర్తిగా స్థానిక కథలతో నాణ్యమైన మైక్రో డ్రామాలను రూపొందించేందుకు స్టోరీ టీవీ సిద్ధమైంది.
ఈ ప్రణాళికలో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్థానిక రచయితలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ఒరిజినల్ కథలను రూపొందించనుంది. ప్రతి భాషలో అక్కడి ప్రేక్షకుల అభిరుచికి తగ్గ కథలను అందిస్తూ, భారతీయ మైక్రో డ్రామాల రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాలని స్టోరీ టీవీ భావిస్తోంది.
ప్రముఖ దర్శకులు, నటీనటులతో తెలుగు ఒరిజినల్స్
తెలుగు ఒరిజినల్ షోల కోసం ఇప్పటికే పలువురు ప్రముఖులు స్టోరీ టీవీతో చేతులు కలిపారు. ‘వన్ లాస్ట్ రైడ్’ దర్శకుడు అజ్జు, నంది అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాష్ (స్వాతి చినుకులు, ఋతురాగాలు), అలాగే చరణ్ లక్కరాజు (టెంపరరీ రూమ్‌మేట్స్), రాజ్ (బిగ్‌బాస్ తెలుగు), అన్విత (దేవయాని), విశాలాక్షి (లక్ష్మీ నివాసం), రక్ష (గుప్పెడంత మనసు), రోహిత్ (అభిషేకం), మోనిక (పద్మావతి కళ్యాణం) వంటి ప్రముఖ నటీనటులు ఈ ప్రాజెక్టుల్లో భాగమవుతున్నారు.
దక్షిణాదిలో పెరుగుతున్న స్టోరీ టీవీ ఆదరణ దక్షిణ భారత ప్రేక్షకుల్లో స్టోరీ టీవీకి ఇప్పటికే మంచి ఆదరణ లభిస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కొచ్చి నగరాలు స్టోరీ టీవీకి అత్యధికంగా వీక్షణలు అందిస్తున్న నగరాలుగా నిలిచాయి. దక్షిణాది ప్రేక్షకులు రోజుకు సగటున 95 నిమిషాలకు పైగా స్టోరీ టీవీలో గడుపుతున్నారని సంస్థ వెల్లడించింది.
“ప్రేక్షకులు తమ భాషలోనే కథలను కోరుకుంటున్నారు” ఈ సందర్భంగా స్టోరీ టీవీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ GSN Aditya మాట్లాడుతూ…
“ఈరోజు వినోదం పూర్తిగా మొబైల్‌కే పరిమితమైంది. ప్రేక్షకులు కూడా తమ భాషలో, తమ సంస్కృతికి, తమ జీవితాలకు దగ్గరగా ఉండే కథలనే ఎక్కువగా చూడాలని కోరుకుంటున్నారు. అలాంటి కథలను తక్కువ సమయంలో ఆసక్తికరంగా చెప్పడానికి మైక్రో డ్రామా ఒక అద్భుతమైన ఫార్మాట్‌గా మారింది. దీంతో రచయితలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లు… ఇలా ఎంతో మంది సృజనాత్మక ప్రతిభకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. భారతీయ కథలను మరింత కొత్తగా, మరింత మందికి చేరేలా చెప్పడానికి ఇది ఒక మంచి వేదికగా మారింది.” అని అన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో స్టోరీ టీవీ ప్రణాళికల గురించి ఆయన మాట్లాడుతూ… “మా ప్రయాణంలో తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ కథలకు ఉన్న ఆదరణ, సృజనాత్మక ప్రతిభ రెండూ అసాధారణమైనవి. అందుకే స్థానిక రచయితలు, దర్శకులు, నటీనటులు, టెక్నీషియన్లతో కలిసి మరిన్ని ఒరిజినల్ కథలను రూపొందించేందుకు పెట్టుబడి పెడుతున్నాం. తెలుగు ప్రేక్షకులకు అత్యుత్తమమైన మైక్రో డ్రామాలను అందించడమే కాదు, ఇక్కడ నిర్మించే కథలతో దేశవ్యాప్తంగా ప్రీమియం వర్టికల్ స్టోరీటెల్లింగ్‌కు కొత్త దిశ చూపించాలని కోరుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మొదలవుతున్న ఈ ప్రయాణమే రేపు దేశంలోని ఇతర భాషల్లో మా ఎదుగుదలకు బలమైన పునాది అవుతుందని మేము విశ్వసిస్తున్నాం.” అని తెలిపారు.
మిలియన్ల వ్యూస్ సాధించిన తెలుగు ఒరిజినల్ షోలు
స్టోరీ టీవీ రూపొందించిన తెలుగు ఒరిజినల్ షోలు ఇప్పటికే మిలియన్ల వ్యూస్ సాధించాయి. వాటిలో మార్కెట్ లో కొత్త సరుకు, వారసుడు వచ్చాడు, రక్త సంబంధం వంటి షోలు ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ఇకపై తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, థ్రిల్లర్, రివెంజ్, కామెడీ, ఎమోషనల్ డ్రామా వంటి విభిన్న జానర్లలో మరిన్ని ఒరిజినల్ మైక్రో డ్రామాలను స్టోరీ టీవీ తీసుకురానుంది.
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత మార్కెట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ, దేశవ్యాప్తంగా ప్రాంతీయ భాషల్లో కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి స్టోరీ టీవీ సిద్ధమవుతోంది. రాబోయే రోజుల్లో కొత్త భాషలు, కొత్త ఒరిజినల్ టైటిల్స్, మరిన్ని క్రియేటివ్ భాగస్వామ్యాల వివరాలను కూడా ప్రకటించనున్నట్లు సంస్థ తెలిపింది.
