గురు పౌర్ణమి వేడుకల్లో భక్తి పారవశ్యం

  • మైలవరంలో శోభాయాత్రలు.. ప్రత్యేక పూజలు
  • అన్నప్రసాదంతో వేలాది మంది భక్తుల సందడి

మైలవరం, ఆంధ్రప్రభ: వ్యాస పూర్ణిమ (గురు పౌర్ణమి) సందర్భంగా మైలవరం–తిరువూరు రోడ్డులోని షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం గురు పౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధల నడుమ జరిగిన ఈ మహోత్సవాలకు మైలవరం, పరిసర గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి సాయిబాబా ఆశీస్సులు పొందారు.

ఉదయం ఎస్‌ఎస్ కన్వెన్షన్ కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన పల్లకి ఉత్సవం ప్రధాన రహదారుల గుండా మేళతాళాలు, కోలాటాలు, భజనలు, ఆధ్యాత్మిక గీతాల నడుమ వైభవంగా సాగింది. సాయి భక్తులు భక్తి పారవశ్యంతో శోభాయాత్రలో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు. ప్రత్యేకంగా అలంకరించిన సాయిబాబా విగ్రహాన్ని భక్తులు దర్శించుకుని, అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, మహా హారతి కార్యక్రమాలను సేవాదళ్ సభ్యులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ కార్యక్రమాల నిర్వహణలో గౌరవాధ్యక్షుడు కాటమనేని వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు రాయల లక్ష్మణరావు, అన్నదాన సొసైటీ అధ్యక్షుడు పొట్టి ముత్యపు ప్రభాకర్‌రావు, కమిటీ సభ్యులు, సేవాదళ్ సభ్యులు సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. వేలాది మంది భక్తుల రాకతో షిరిడి సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, గురు పౌర్ణమి వేడుకలు భక్తి, సంప్రదాయం, సేవాభావానికి ప్రతీకగా నిలిచాయి.