మున్సిపల్ స్థలాన్ని కాపాడాలని కమిషనర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని విజ్ఞప్తి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి రక్షించాలని, అక్కడ ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని కోరుతూ బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బుడ్డా సురేష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌కు బుధవారం ఫిర్యాదు చేశారు.

మండల కేంద్రంలోని జాతీయ రహదారి-65 నుంచి బంగారిగడ్డకు వెళ్లే దారిలో, నాగులకుంట మీదుగా తంగడపల్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 322లో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి పడమర వైపున సుమారు 400 గజాల మున్సిపల్ స్థలం ఉందని తెలిపారు. ఈ స్థలంలో 2024లో కుంట్లగూడెంకు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా భవన నిర్మాణానికి ప్రయత్నించగా, అప్పటి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు స్పందించి నిర్మాణాన్ని అడ్డుకున్నారని గుర్తు చేశారు.

తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి మున్సిపల్ స్థలాన్ని తమదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. రాత్రికి రాత్రే స్థలాన్ని చదును చేసి, ప్లాట్లుగా విభజించి విక్రయాలకు సిద్ధం చేస్తున్నారని, అక్రమ నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నారని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సదరు స్థలం మున్సిపాలిటీకి చెందినదేనని స్పష్టం చేస్తూ, ఆ స్థలానికి ఎలాంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేయవద్దని, ఆక్రమణదారుల నుంచి వెంటనే స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్‌ను కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ చౌటుప్పల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, 2వ వార్డు కౌన్సిలర్ పోలేపల్లి లక్ష్మి ముత్తయ్య, 6వ వార్డు కౌన్సిలర్ ఆలే శ్రీలత చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.