Byreddy Sabari | పార్లమెంట్ లో ఎంపీ శబరీ ఘాటు విమర్శలు..!

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: వైసీపీ ఎంపీలు నిజమైన “కామెడీ జాతిరత్నాలు” అని, వారిని చూసే సినిమా తీశారేమో అనిపిస్తోందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి విమర్శించారు. వైసీపీ పాలనలో ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా, ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలా పెట్టిన వారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

బుధవారం భారత పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీల వైఖరిని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు తీసుకొచ్చిన అత్యంత కీలకమైన బిల్లుపై సభలో చర్చించాల్సిన సమయంలో వైసీపీ ఎంపీలు ఆ అంశాన్ని పక్కనపెట్టి ఇతర విషయాలపై మాట్లాడటం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.

జంతర్ మంతర్ వద్ద వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు నిరసనలకు మద్దతు తెలిపినప్పటికీ, వైసీపీ ఎంపీలు మాత్రం ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళనలు చేస్తున్న వైసీపీ నేతలు ప్రజా సమస్యల కోసం కాకుండా రాజకీయ స్వార్థం కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు.

ఎప్పుడూ శవయాత్రలు, నిరసనల రాజకీయాలకే పరిమితమయ్యే వైసీపీకి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల కంటే స్వార్థ రాజకీయాలకే వైసీపీ ప్రాధాన్యం ఇస్తోందని డాక్టర్ బైరెడ్డి శబరి లోక్‌సభలో, అనంతరం పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడుతూ విమర్శించారు.