ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం
పొంగిపొర్లుతున్న వాగులు.. ఇళ్లలోకి చేరిన వరద నీరు
దండెపల్లి, ఆంధ్రప్రభ : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దండెపల్లి మండలంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. నిరంతర వర్షాలతో స్థానిక వాగులు, వంకలు ఉధృతంగా పొంగిపొర్లుతున్నాయి.
భారీగా ప్రవహిస్తున్న వరద నీటితో పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీరు సక్రమంగా వెళ్లకపోవడంతో వరద నీరు ఇళ్లలో నిలిచి నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు నీటమునిగినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అత్యవసర పనులపై బయటకు వెళ్లాలన్నా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఇళ్లలోకి వరద నీరు చేరిన బాధితులను అధికారులు వెంటనే గుర్తించి అవసరమైన సహాయం అందించాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
