ఫార్మర్ యాప్ సేవలపై క్షేత్రస్థాయి సమీక్ష
- పంటల బీమాలో ప్రతి రైతు చేరాలి: జిల్లా వ్యవసాయ అధికారి
యడ్లపాడు, ఆంధ్రప్రభ: యడ్లపాడు రైతు సేవా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఏపీ సచివాలయం) వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లవరపు సూర్య తేజ,శాస్త్రవేత్తల బృందంతో కలిసి బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా ఏపీ ఎయిమ్స్ 2.0 (ఫార్మర్ యాప్) ద్వారా రైతులకు అందుతున్న సాంకేతిక సేవలు, డిజిటల్ సమాచారం,సాగు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అక్కడి రైతులు,వ్యవసాయ సహాయ సిబ్బంది,వాసర్ ల్యాబ్ సాంకేతిక సిబ్బందితో నేరుగా చర్చించారు.
ఫార్మర్ యాప్ ద్వారా రైతులకు సమయానికి సమాచారం అందుతోందా, ఎంతమంది రైతులు యాప్ను వినియోగిస్తున్నారు,యాప్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై అధికారులు ఆరా తీశారు. అనంతరం వాసర్ ల్యాబ్ సాంకేతిక సిబ్బందికి ప్రతి రైతుకు రైతు వారీగా,సీజన్ వారీగా, పంట వారీగా నోటిఫికేషన్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు మాట్లాడుతూ.. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పల్నాడు జిల్లాలో పత్తి పంటకు అగ్రికల్చర్ క్రాప్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రతి రైతు తప్పనిసరిగా పంటల బీమా పథకంలో చేరాలని సూచించారు. పత్తి పంట బీమా నమోదు కోసం జూలై 31, 2026 వరకు అవకాశం ఉందని, ఎకరాకు రూ.1,900 చెల్లించి బీమా పొందవచ్చని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద వరికి రూ.80, కందికి రూ.40, మిరప పంటకు రూ.360 చొప్పున ప్రీమియం చెల్లించి బీమా సదుపాయం పొందవచ్చని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో నరసరావుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు కె.వి. శ్రీనివాసరావు, మండల వ్యవసాయ అధికారి ఎ. హరిప్రసాద్, వ్యవసాయ విస్తరణ అధికారి జీవన్, గ్రామ వ్యవసాయ సహాయకుడు బిలాల్తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
